మార్చి 1 నుంచి శ్రీ కనక మహాలక్ష్మి జాతర

చీపురుపల్లి, రూరల్‌: మార్చి–1 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి 22వ జాతర మహాత్సవాలను సమష్టి కృషితో విజయవంతం చేస్తామని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ అన్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మంగళవారం జరిగిన ఆలయ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆలయ కమిటీ ఏర్పాటులో నిర్లక్ష్యం చేసిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కమిటీని నియమించిందన్నారు. ఈ ఏడాది జరగనున్న 22వ జాతర మహోత్సవాలను ఆలయ కమిటీ విజయవంతంగా పూర్తి చేయటానికి కృషి చేస్తుందని తెలిపారు. అమ్మవారి అర్చనలో అడ్డూరి వంశానికి మొదట నుంచి ప్రాధాన్యం ఉందని, ఇప్పటికీ ఆ సంప్రదాయం కొనసాగుతుందన్నారు. ఈ కారణంగా అడ్డూరి వంశానికి చెందిన వారికి ఆలయ కమిటీలో స్థానం కల్పించామన్నారు. కార్యక్రమంలో ఎంపీ సతీమణి బెల్లాన శ్రీదేవి, ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసులనాయుడు, పతివాడ రాజారావు, ఇప్పిలి తిరుమల, ఆలయ కమిటీ చైర్మన్‌ ఇప్పిలి గోవింద, సూరు వెంకటకుమార్‌స్వామి పాల్గొన్నారు.