అమరావతి: మాజీ సీఎం చంద్రబాబు ఖజానాను కాంట్రాక్టర్లకు దోచిపెట్టి వసూలు చేసిన కమీషన్లలో కొంత భాగాన్ని ఇతర రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానానికి ఇం‘ధనం’గా సమకూర్చారని ‘సాక్షి’ గతంలో వెల్లడించిన అంశాలు అక్షర సత్యమని ఆదాయపు పన్నుశాఖ తాజాగా నిర్వహించిన దాడుల్లో వెల్లడైంది. చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో లభ్యమైన డాక్యుమెంట్లలో వెల్లడైన అంశాల ఆధారంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆంతరంగికుడు అహ్మద్ పటేల్‌కు రూ.400 కోట్లకుపైగా నల్లధనాన్ని హవాలా మార్గంలో చేరవేసినట్లు ఐటీ శాఖ గుర్తించింది.
దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఈనెల 11న అహ్మద్ పటేల్‌కు నోటీసులు జారీ చేసిన ఐటీ అధికారులు 14వతేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే తన ఆరోగ్యం బాగాలేదని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానంటూ విచారణకు హాజరు కాకుండా తప్పించుకున్నారు. దీంతో అహ్మద్‌పటేల్‌కు ఈనెల 18న ఐటీ శాఖ మరోసారి నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల్లోగా తమ ఎదుట విచారణకు హాజరై రూ.400 కోట్లకు లెక్కలు చెప్పాలంటూ స్పష్టం చేయడం సంచలనం రేపుతోంది. ఈ వ్యవహారంపై ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్), ఎస్‌ఎఫ్‌ఐవో(సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్) రంగంలోకి దిగాయి.
చంద్రబాబు అధికారంలో ఉండగా సాగునీటి ప్రాజెక్టుల నుంచి పేదల ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టుల వరకు అన్నిట్లో అంచనా వ్యయాలను పెంచేసి కమీషన్లు చెల్లించే కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు. ఎన్నికల్లో ఓటమిని పసిగట్టిన చంద్రబాబు అక్రమాల నుంచి రక్షణ పొందేందుకు కాంగ్రెస్ పంచన చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల శాసన సభలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల నిధులు సమకూర్చారు. అయితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కనుమరుగు కావడం, రాష్ట్రంలో టీడీపీ ఘోర పరాజయంతో చంద్రబాబు ఎత్తులు చిత్తయ్యాయి.